ఆంధ్రకు నీళ్లు - తెలంగాణకు కన్నీళ్లు
సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పారించి, తెలంగాణ రైతులకు మాత్రం కన్నీళ్లే మిగిల్చిన దుర్మార్గుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, తదితర నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే 'స్కాంగ్రెస్' అని, సుమారు 3 వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి పాల్పడి విద్యుత్ ఉత్పత్తిని దెబ్బతీసి రైతులకు కరెంట్ లేకుండా చేశారని ఆరోపించారు. పండిన పంటకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే దురుద్దేశంతోనే ప్రభుత్వం రైతులకు సాగునీరు, విద్యుత్ సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నిరంతర విద్యుత్, పుష్కలంగా సాగునీరు అందించి వ్యవసాయాన్ని పండుగలా మారిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర గోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో వరి పంట వేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమని, అలాంటప్పుడు రైతులు ఎలా బతకాలని, వారికి ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రైతులను నిలువునా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని అన్నదాతలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.
అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు విపరీతంగా పెరిగాయని, రైతుబంధు పథకాన్ని ఎగ్గొట్టి అన్నదాతలను నిండా ముంచారని ఆరోపించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే సాగునీరు అందించలేక యాసంగిలో వరి వేయవద్దంటూ చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని విమర్శించారు.
సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ సెస్ పరిధిలో విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యుత్ లేక రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కరెంట్ కోతలు లేకుండా నిరంతర సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. పంట పొలాల్లో ఒక్క గుంట ఎండిపోయినా రైతాంగంతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, మ్యాన రవి, గజాభింకర్ రాజన్న, కౌన్సిలర్లు బాలు, నాగరాజు, సంపత్, శ్రీకాంత్ రావు, అమర్ రావు, మీసాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.