స్థానిక పోరుకు సీపీఐ సై
రిజర్వేషన్లు ఖరారవగానే అభ్యర్థుల ప్రకటన
- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ
పామూరు, మేజర్ న్యూస్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ పోటీకి సిద్ధంగా ఉందని ఆ పార్టీ మార్కాపురం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు. బుధవారం పామూరులోని భారత కమ్యూనిస్టు పార్టీ గుజ్జల యల్లమందారెడ్డి భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సీపీఐ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోందన్నారు. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న సీపీఐకి స్థానిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ మౌలాలి, మండల కార్యదర్శి పాలపర్తి మస్తాన్రావు, ఆకుల మోహన్రావు, వజ్రాల సుబ్బారావు, ఇర్రి హజరత్రెడ్డి, సూరిబాబు, కిషన్సింగ్, ధూపాటి ఆదిలక్ష్మమ్మ, ఇర్రి వెంకటరెడ్డి, వెలగపూడి ప్రసాద్, మహేష్, దేవకుమార్, మాలకొండయ్య, దేవిరెడ్డి బాలసుబ్బయ్య తదితర సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.