స్థానిక ఎన్నికలకు జిల్లా సిద్ధం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
*రాజమహేంద్రవరం కార్పొరేషన్ వార్డుల పునర్విభజన వారం రోజుల్లో పూర్తి* - కలెక్టర్
*ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలి -; ఎస్పీ డి నరసింహ కిశోర్*
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి తెలిపారు.
గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ , ఇతర అధికారులు పాల్గొని జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లపై నివేదిక సమర్పించారు.
*342 గ్రామ పంచాయతీలు.. 4,040 వార్డులు*
జిల్లాలోని 21 మండలాల పరిధిలో 342 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. యాక్ట్–5 ప్రకారం రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని 9, కడియం మండలంలోని ఒక గ్రామ పంచాయతీ.. మొత్తం 10 పంచాయతీలు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయని వివరించారు.
మొత్తం 4,040 వార్డుల పరిధిలో 13,43,601 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,57,950 మంది పురుషులు, 6,85,603 మంది మహిళలు, 48 మంది ఇతరులు ఉన్నారు. సెప్టెంబర్ 7న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం ఎస్టీ ఓటర్లు 12,208, ఎస్సీ ఓటర్లు 2,79,034, బీసీ ఓటర్లు 5,32,385, ఓసీ ఓటర్లు 5,19,974 మంది ఉన్నారు.
*4,398 పోలింగ్ కేంద్రాలు*
జిల్లాలో 1,479 ప్రాంతాల్లో 4,398 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వీటిలో 2,556 సాధారణ, 926 సమస్యాత్మక, 916 అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు.
సర్పంచ్ ఎన్నికలకు పింక్, వార్డు సభ్యుల ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను వినియోగించనున్నారు. సుమారు 32.40 లక్షల బ్యాలెట్ పేపర్ల ముద్రణకు చర్యలు చేపట్టగా, ఎన్నికల కోసం 6,390 బ్యాలెట్ బాక్సులు అవసరమని అంచనా వేశామన్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు టెండర్లను అక్టోబర్ 7 నుంచి 12 వరకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
*రెండు లేదా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు*
గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఎన్నికల విధుల కోసం 4,812 మంది ప్రిసైడింగ్ అధికారులు, 4,812 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 7,710 మంది పోలింగ్ సిబ్బంది, 2,149 మంది సూక్ష్మ పరిశీలకులను గుర్తించి శిక్షణ ఇస్తున్నట్లు , అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా రెండు దశల్లో నిర్వహించేలా చూడాలని ఎస్పీ డి నరసింహ కిశోర్ కోరడం జరిగింది. రెండు దశల్లో నిర్వహించడం ద్వారా సిబ్బంది, పోలీసు బందోబస్తు, ఇతర వనరులను సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
*సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా*
*స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత*
సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులతో పాటు డిజిటల్ ఫొటోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని పోలింగ్ కేంద్రాలను ముందుగానే క్షేత్రస్థాయిలో పరిశీలించి తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు, వెలుతురు తదితర కనీస సౌకర్యాలను కల్పించాలని సూచించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను మరోసారి పరిశీలించి అవసరమైన అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బ్యాలెట్ బాక్సుల పంపిణీ, రవాణా, పోలింగ్ అనంతరం తిరిగి తరలింపు, స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచే వరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ టేబుళ్లు, బ్యారికేడింగ్, విద్యుత్, వెలుతురు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
కౌంటింగ్ సిబ్బందికి బ్యాలెట్ పేపర్ల లెక్కింపు, చెల్లుబాటు అయ్యే–చెల్లని ఓట్ల గుర్తింపు, ఫలితాల నమోదు తదితర అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ సిబ్బంది కేటాయింపులను నిబంధనల ప్రకారం చేపట్టడంతో పాటు ఎన్నికల సామగ్రి, వాహనాల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
*కార్పొరేషన్ వార్డుల పునర్విభజన వారం రోజుల్లో*
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించిన ముసాయిదాను గురువారం ప్రచురిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ముసాయిదా ప్రచురణ అనంతరం ఏడు రోజుల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను తుది రూపు ఇస్తామని ఎస్‌ఈసీకి వివరించారు.
వార్డుల పునర్విభజనతో పాటు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రక్రియను కూడా ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
*మూడు పురపాలక సంఘాల్లో ఏర్పాట్లు పూర్తి*
జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు.
మండపేట: 36 వార్డులు, 49,059 మంది ఓటర్లు, 72 పోలింగ్ కేంద్రాలు.
నిడదవోలు: 32 వార్డులు, 35,086 మంది ఓటర్లు, 49 పోలింగ్ కేంద్రాలు.
కొవ్వూరు: 28 వార్డులు, 34,452 మంది ఓటర్లు, 52 పోలింగ్ కేంద్రాలు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రతి దశలోనూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, పురపాలక, రవాణా తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, అదనపు ఎస్పీ దేవరాజ్ పాటిల్, సంబంధిత అధికారులు పాల్గొన్నా