ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 కర్టెన్ రైజర్: సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన సీఐఐ ప్రతినిధులు
సూర్య వాణిజ్య డెస్క్: జాతీయ రాజధాని న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన 'సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) - 2026' కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అధ్యక్షుడు ఆర్. ముకుందన్, డీజీ చంద్రజిత్ బెనర్జీతో పాటు పరిశ్రమల రంగ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అపారమైన అవకాశాలు, అనుకూల వాతావరణం ఉన్నాయని వివరించారు. ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్, థాట్ లీడర్‌షిప్ వంటి ప్రధానాంశాలతో విశాఖపట్నం వేదికగా త్వరలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు భారీగా తరలిరావాలని ఆహ్వానించారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అద్భుతమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో పెట్టుబడిదారులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ మెట్రో, గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు పారిశ్రామిక వేత్తలు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.