ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన ఎస్ఈసీ
అమరావతి, సూర్య ప్రతినిధి :సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికలను దశల వారీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, ఇతర పోలింగ్ సామగ్రిని సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.