సింగీతం శ్రీనివాసరావుకు ఘన నివాళి
గూడూరు, మేజర్‌న్యూస్ : గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత సింగీతం శ్రీనివాసరావుకు ఘ నివాళి అర్పించారు. గురువారం ఉదయం బాలుర ఉన్నత పాఠశాలలోసహ విద్యార్ధి ఆడిటర్ శ్రీకంటి రామ్మోహనరావు ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించి తమ సహ విద్యార్ధి అయిన సింగీతం శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకంటి రామ్మోహనరావు మాట్లాడుతూ తెలుగు సినిమాకు ఒక ప్రత్యేకమైన శైలిని పరిచయం చేసిన సృజనశాలి సంగీతం శ్రీనివాసరావు మన పాఠశాలలో విద్యను అభ్యసించడం గర్వంగా ఉందన్నారు. ఆయన చేసిన సినిమాలు మాత్రమే కాదు ఆయన చూపించిన ఆలోచన విధానం కూడా తెలుగు సినీ రంగంపై ఒక చెరగని ముద్ర వేసుకుందని, విద్యార్థులందరూ అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని, చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు విద్యాశాఖ అధికారి మహమ్మద్ రవూఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, బండి ధనుంజయ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, కోదండరాం, ప్రసాద్ రావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.