2027 నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతాం: మంత్రి నిమ్మల రామానాయుడు!
సూర్య ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన డయాఫ్రం వాల్, ప్రధాన డ్యామ్ పనులను సరిదిద్ది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో పోలవరం పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయితే ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తాగు, సాగునీటి కొరత శాశ్వతంగా తీరడమే కాకుండా భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని వివరించారు. పోలవరం నుంచి విడుదలయ్యే నీటితో కృష్ణా, పెన్నా డెల్టాలను స్థిరీకరించి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బృహత్తర ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.