సంగీత సాహిత్య సాంస్కృతిక రాజధాని విజయనగరం - మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం మేజర్ న్యూస్
విజయనగరం సకల కళలకు పుట్టినిల్లు అని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు, శ్రీ శ్రీ కళా వేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం నిర్వహించారు. శ్రీ శ్రీ కళా వేదిక, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్తంగా గురజాడ పాఠశాలలో సాహిత్య సంగీత సాంస్కృతిక వైభవం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురజాడ అప్పారావు, ఆదిభట్ల నారాయణదాసు వంటి మహనీయులు నడయాడిన పవిత్రమైన నేలపై ఇటువంటి ఉత్సవం జరగడం సంతోషమని పేర్కొన్నారు. సుమారు ఆరు రాష్ట్రాల నుంచి 300 మంది కవులు తమ కవితలు వినిపించడానికి విజయనగరం రావడం ముదావహమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ మహిళా అధ్యక్షురాలు కే. ఈశ్వరి భూషణం, జాతీయ ప్రణాళిక అధికారి డాక్టర్ పార్థసారథి, జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ కృష్ణాజి తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం