సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:ప్రొద్దుటూరు పట్టణంలోని సుందరాచార్యుల వీధిలో పీర్ల సావిడి నుంచి వైఎస్సార్ మహిళా పార్కు వరకు చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్, టీడీపీ ప్రొద్దుటూరు పట్టణ ఉపాధ్యక్షుడు కె. ఖలీల్ భాషా కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన రహదారి కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, ఎలాంటి జాప్యం లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
- ఎ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా