పంటలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్
అనంతపురం బ్యూరో : ఖరీఫ్–2026 సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటల ఈ-పంట నమోదును జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాప్తాడు మండలంలో చేపట్టిన ఈ-పంట నమోదు సూపర్ చెక్‌లో భాగంగా పలు సర్వే నంబర్లలో నమోదైన పంటలను ఆయన పరిశీలించారు.
రాప్తాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని 337-4పీ సర్వే నంబర్‌లో సాగు చేసిన చీనీ పంటతో పాటు 337-4బీ సర్వే నంబర్‌లోని చీనీ పంటను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పొలాల్లో పంట సాగు చేస్తున్న రైతులతో జేసీ మాట్లాడి, వారు సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ-పంట నమోదులో వివరాలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాలను అధికారులు పరిశీలించారు. రైతులు సాగు చేస్తున్న పంటలకు సంబంధించి నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రాప్తాడు తహసీల్దార్ చెన్నకేశవులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారి, సంబంధిత రెవెన్యూ గ్రామాల వీఆర్వోలు, వీఏఓలు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.