కంబదూరులో ట్రాన్స్ ఫార్మర్ పేలి మంటలు.
సూర్య, కళ్యాణదుర్గం టౌన్ :మండల కేంద్రంలోని చెక్‌పోస్టు కాలనీలో గురువారం ఉదయం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ భారీ శబ్దంతో పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెలుగు కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మంటలు వ్యాపించడంతోపాటు విద్యుత్ వైర్లు కాలిపోయి తెగిపడి రహదారిపై పడిపోయాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు అనంతరం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సమస్య కారణంగా ఇళ్లలోని ఫ్యాన్లు, టీవీలు, నీటి మోటార్లు తదితర విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయని పలువురు కాలనీవాసులు తెలిపారు. తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నప్పటికీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాత ట్రాన్స్‌ఫార్మర్ కావడంతోనే తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దాని సామర్థ్యాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదకరంగా తెగిపడిన విద్యుత్ వైర్లతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రజల భద్రతపై ఆందోళన నెలకొంది. సంబంధిత విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న వైర్లను తొలగించి కొత్త వైర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. అలాగే పాత ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, కాలనీలో విద్యుత్ సరఫరా వ్యవస్థను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.