తొలగించిన ఓటర్ల జాబితాలో ప్రతి పేరును క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో:ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)-2026లో భాగంగా తొలగించిన ఓటర్ల వివరాలను బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి క్షుణ్ణంగా పునఃపరిశీలించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో లేకుండా పారదర్శకంగా, తప్పులు లేని జాబితాను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కలెక్టర్ ప్రధాన ఆదేశాలు:
1)తొలగించిన 1,81,545 మంది ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పునఃధృవీకరించాలి.
2)మరణం, శాశ్వత వలస, ఆచూకీ లభించకపోవడం, బహుళ నమోదు తదితర కారణాలతో తొలగించిన ప్రతి పేరును నిశితంగా పరిశీలించాలి
3)అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగించబడినట్లు గుర్తిస్తే, వారికి ఫారం-6 సమర్పణలో సహకరించి, నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో తిరిగి నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలి
4)కొత్తగా 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి
5)ఓటర్ల జాబితా పునఃధృవీకరణలో ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చురుకుగా సహకరించేలా చర్యలు చేపట్టాలి
1,81,545 మంది ఓటర్ల వివరాలపై పునఃపరిశీలన
భారత ఎన్నికల సంఘంనిర్దేశించిన“అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు నమోదు కావాలి.. అనర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా ఓటర్ల జాబితాలో ఉండకూడదు”అనే లక్ష్యానికి అనుగుణంగా SIR-2026 గణన దశలో 2026 జూన్ 15 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మరణం, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం, ఆచూకీ లభించకపోవడం, ఒకటికంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదై ఉండటం తదితర కారణాలతో 1,79,506 మంది ఓటర్లు కేటాయించిన చిరునామాల్లో అందుబాటులో లేనట్లు గుర్తించారు. గణన ప్రక్రియ అనంతరం 2026 జూలై 31న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 12,25,937 మంది ఓటర్లు ఉన్నారు. అనంతరం నోటీసుల ప్రక్రియలో భాగంగా అక్టోబరు 6 నాటికి మరో 2,039 మంది ఓటర్లు అనర్హులుగా గుర్తించబడ్డారు. ఈ నేపథ్యంలో మొత్తం 1,81,545 మంది ఓటర్ల వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
*అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు*
పునఃధృవీకరణలో భాగంగా పొరపాటున ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన అర్హులైన వ్యక్తులకు ఫారం-6 సమర్పించేందుకు సహాయం అందిస్తారు. సంబంధిత వివరాలను పరిశీలించి, నిబంధనల మేరకు నిరంతర నవీకరణ (Continuous Updation) ప్రక్రియలో వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SIR-2026లో భాగంగా తుది ఓటర్ల జాబితాను అక్టోబరు 16, 2026న ప్రచురించనున్నారు. తుది జాబితాలో పేరు లేని అర్హులైన వ్యక్తులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1 తేదీలను ఓటరు నమోదుకు అర్హత తేదీలుగా పరిగణిస్తారు. 2027 జనవరి 1 అర్హత తేదీగా వార్షిక సంక్షిప్త సవరణ ప్రక్రియ కూడా నిర్వహించబడుతుంది.ఓటర్ల జాబితా పునఃధృవీకరణ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విజ్ఞప్తి చేశారు.
మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*