ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం:
సూర్య సినీ డెస్క్: భారతీయ సినీ పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు, నిర్మాత నానా పటేకర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో నటించి, కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన ఆకస్మిక మరణం తీవ్ర విచారకరమని మంత్రి పేర్కొన్నారు.
నానా పటేకర్ మరణవార్త తెలుసుకున్న అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. నానా పటేకర్ కేవలం వెండితెరపైనే కాకుండా సమాజ సేవలోనూ ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. 'నామ్ ఫౌండేషన్' ద్వారా మహారాష్ట్రలోని కరవు పీడిత ప్రాంతాల రైతు కుటుంబాలను ఆదుకోవడంలో ఆయన చూపిన చొరవ అపూర్వమైనదని గుర్తుచేశారు. నటనలో తీవ్రత, సహజత్వం, భావోద్వేగాలను పండించడంలో ఆయన శైలి అద్వితీయమని, భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
అమాయక్, క్రాంతివీర్, పరిందా, తిరంగా, వెల్‌కమ్ వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి పేర్కొన్నారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్న ఆయన కళా సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. నానా పటేకర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి కందుల దుర్గేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.