చీపురుపల్లి మరింత అభివృద్ధికి సహకరిస్త : బొత్స
చీపురుపల్లి మేజర్ న్యూస్: చీపురుపల్లి పంచాయతీని ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మీసాల వరహాలు నాయుడు, వార్డు అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ సోమవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మూడు రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు. అనంతరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణంలో ప్రతీ వీధికి రహదార్లు, డ్రైనేజీ , తాగునీటి సరఫరా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. చీపురుపల్లి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకత్వాన్ని గెలిపించాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థి మీసాల వరహాలు నాయుడు తో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే చీపురుపల్లి మేజర్ పంచాయతీని మరింత అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఇప్పిలి అనంత్, బెల్లాన వంశీ, పావని, రెడ్డి గోవింద్, కార్యకర్తలు పాల్గొన్నారు. బహిరంగ సభలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్లు వేసే కార్యాలయానికి రాకుండా అభ్యర్ధులకు నిరాశ మిగిల్చారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మీసాల వరహాలనాయుడు నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ హాజరు కాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. పట్టణంలో జరిగిన ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొన్న వారు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఉంటారని ఆశించిన వారికి నిరాశే మిగిల్చారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా