మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్
సాలూరు, మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి తెలుగు దేశం పార్టీని వరించింది. రసవత్తరంగా సాగిన వైస్ ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి పప్పల మోహన్ తన ప్రత్యర్థి జనసేనకు చెందిన గేదెల లావణ్య పై మూడు ఓట్ల తేడాతో గెలుపొందారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం స్థానిక కౌన్సిల్ హాలులో ప్రిసైడింగ్ అధికారి సచిన్ రహర్(సబ్ కలెక్టర్)చైర్ పర్సన్ తో పాటు కౌన్సిల్ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను జరిపారు. టీడీపీ తరఫున మున్సిపల్ రెండవ వార్డు నుండి గెలుపొందిన పప్పల మోహన్ పేరును ఒకటవ వార్డు కౌన్సిలర్ కొనిసి వర లక్ష్మి ప్రతిపాదించగా, 22వ వార్డు సభ్యురాలు మజ్జి శైలజ బలపరిచారు. అదేవిదంగా 13వ వార్డు నుండి జనసేన తరపున గెలుపొందిన గేదెల లావణ్య పేరును స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన శ్రీరాములు ప్రతిపాదించగా జన సేన గుర్తు పై పదవ వార్డు నుండి గెలుపొందిన మీసాల సతీశ్ బలపరిచారు. దీనితో టీడీపీ, జనసేన పార్టీల నుండి వైస్ చైర్మన్ పదవికి పోటీ ఏర్పడగా పప్పల మోహన్ కి 18, లావణ్య కి 15ఓట్లు వచ్చాయి. తెలుగు దేశం పార్టీకి చెందిన 11మంది, ముగ్గురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజెపి తరఫున గెలుపొందిన ఒకరు, ఇరువురు స్వతంత్రులు, ఎక్స్అఫీషియో సభ్యురాలితో కలిసి 18 మంది టీడీపీ అభ్యర్థికి మద్దతుగా చేతులు ఎత్తి తమ సమ్మతిని తెలుపగా, జనసేన అభ్యర్థి లావణ్యకు చైర్ పర్సన్ తో పాటు నలుగురు జనసేన సభ్యులు, ఒక ఇండిపెండెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది వెరశి 15మంది మద్దతు తెలిపారు. ఫలితంగా మూడు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మోహన్ వైస్ చైర్మన్ గా గెలుపొందినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. వైకాపా కి చెందిన పువ్వల భరత్ శ్రీనివాస్ తటస్థంగా ఉండిపోయారు. ఇది ఇలా ఉండగా మంత్రి సంధ్యారాణి వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో తన దైన శైలిలో చక్రం తిప్పారు. జనసేన అభ్యర్థి తమ ప్రత్యర్ధి పార్టీ కౌన్సిలర్లతో చేతులు కలిపి టీడీపీ అభ్యర్ధిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకుని, చకచకా పావులు కదిపారు. అంతేకాకుండా ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి అనే విషయాలను తమ అభ్యర్థి మోహన్ కి దిశా , నిర్దేశం కావించారు. దీంతో జనసేన, టిడిపిలోని ఒక వర్గం నాయకుల ఆటలకు చెక్ పెట్టినట్లు అయింది.