రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి.. తహసీల్దార్ దివాకర్‌కు వినతిపత్రం..
. అమలాపురం మేజర్ న్యూస్ రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని, గౌరవ వేతనం, కమిషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మండల కార్యాలయాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా అమలాపురం మండల చౌకధరల దుకాణాల డీలర్లు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ వాసా దివాకర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ ప్రస్తుతం అందుతున్న కమిషన్ నిర్వహణ ఖర్చులకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డిపోల అద్దె, విద్యుత్ బిల్లులు ఇతర ఖర్చులు భరించడం కష్టంగా మారిందన్నారు. క్యూఆర్ కోడ్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలోనూ పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
బియ్యం బస్తాలపై ఉన్న కోడ్‌లను స్కాన్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వినియోగదారుల ఫోన్ నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కూడా సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఈ విధానాల వల్ల రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
ప్రస్తుతం ఒక్క రూపాయి చొప్పున అందుతున్న కమిషన్ సరిపోవడం లేదని, దానిని నాలుగు నుంచి ఐదు రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి, తగిన గౌరవ వేతనం కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రరేషన్ డీలర్ల గౌరవ అధ్యక్షురాలు నడింపల్లి అన్నపూర్ణ. మాజీ ప్రెసిడెంట్ ఎం.నాగేశ్వరరావు, మోటురి సత్యనారాయణ , , పీ వి సత్యనారాయణ ,అరిగెల బాబ్జీ,సోమనాథం, కాసిన సుబ్రహ్మణ్యం, సుగ్గు సత్యనారాయణ కాసిన వెంకటేశ్వరరావు