రేపు ఉదయం సీపీని కలుస్తాం: అంబటి రాంబాబు
అమరావతి: శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు సీపీని కలిసి ఘటనకు సంబంధించిన అంశాలను వివరిస్తామని చెప్పారు.
అర్థరాత్రి సమయంలో మఫ్టీలో ఉన్న పోలీసులు తమ పార్టీ నేతల వద్దకు వస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. తమ పార్టీ నేతలను అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తే అరెస్టులు చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో నిందితులను రిమాండ్‌కు పంపే విషయంలో కోర్టులు పలుమార్లు సూచనలు చేశాయని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అయితే ఆ నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా తమ పార్టీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటన, అనంతరం పోలీసులు వ్యవహరించిన తీరుపై సీపీకి ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను తెలియజేస్తామని అంబటి రాంబాబు వెల్లడించారు.