హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ
హైదరాబాద్: గచ్చిబౌలి విప్రో సర్కిల్‌లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మన్మోహన్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్ సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు, 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా అందించిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలోనూ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఆయన సేవలకు గుర్తుగా గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.