ఎన్టీఆర్ భావజాల వ్యాప్తిలో అట్లూరి అశ్విన్ పాత్ర చిరస్మరణీయం: టీడీ జనార్దన్
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమ మహోన్నత వ్యక్తి, తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవమైన నందమూరి తారకరామారావు ఆశయాలు మరియు భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఉపాధ్యక్షులు అట్లూరి అశ్విన్ అందించిన సేవలు అనన్యసామాన్యమని ఆ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్ ప్రశంసించారు. హైదరాబాద్‌లో శుక్రవారం అట్లూరి అశ్విన్ జన్మదిన వేడుకలను ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా అశ్విన్ చేత కేక్ కట్ చేయించి, కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ద్వారా విదేశాలలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులను ఏకం చేయడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించారని జనార్దన్ కొనియాడారు.
అమెరికాలో స్థిరపడినప్పటికీ విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులను సమన్వయం చేస్తూ వివిధ దేశాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంలో అట్లూరి అశ్విన్ ఎంతగానో శ్రమించారని కమిటీ సలహాదారు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ గుర్తుచేసుకున్నారు. తాము విదేశాలలో పర్యటించిన సమయంలో అశ్విన్ తమకు అండగా నిలిచి పర్యటనలను విజయవంతం చేయడంలో సహకరించారని తెలిపారు. ఎన్టీఆర్ అన్నగారితో పాటు చంద్రబాబు నాయుడుపై కూడా అశ్విన్ చూపించే అభిమానం ఎంతో నిబద్ధతతో కూడుకున్నదని, నేటి తరానికి ఎన్టీఆర్ ఆశయాలను గుర్తుచేయడంలో ఆయన చేస్తున్న కృషి తెలుగు దేశం పార్టీకి ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తుందని రామకృష్ణ ప్రశంసించారు.
మరో ఉపాధ్యక్షుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అట్లూరి అశ్విన్ ఎంతో కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి అని, కమిటీ కార్యకలాపాలలో ఎప్పుడూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఉదయమే తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నానని, సాయంత్రం కమిటీ సభ్యుల మధ్య ఇలా జన్మదినం జరుపుకోవడం తన జీవితంలో మరువలేని మధురమైన అనుభవమని అట్లూరి అశ్విన్ భావోద్వేగంతో పేర్కొన్నారు. చైర్మన్ జనార్దన్ ఏ లక్ష్యంతో ఈ కమిటీని ప్రారంభించారో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరిందని తాను భావిస్తున్నానని, ఈ కమిటీలో సభ్యుడిగా ఉండటం గర్వకారణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, కళారత్న బిక్కి కృష్ణ, జల్ది విద్యాధర్, రాంబాబు, ప్రకాశం, హను, సాయి జ్యోతి తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.