ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి
మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు.. పరీక్షకు తీసుకెళ్తుండగా ప్రమాదం
ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 26) : ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యంనంపేట బ్రిడ్జిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిప్పారెడ్డిపల్లికి చెందిన కిషోర్ (20) బీఎన్ రెడ్డినగర్‌లో నివాసముంటూ ఇబ్రహీంపట్నంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తన బంధువైన విజయను పరీక్ష రాసేందుకు యంనంపేటలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా యంనంపేట బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన విజయను మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కిషోర్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.రిపోర్టర్ లంబ రాజు