రేపే ‘అర్నాబ్’ తుఫాన్‌గా తీవ్రరూపం * ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన..
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం కలకలం రేపుతోంది. ఇది నైరుతి దిశగా కదులుతూ మరింత బలపడుతోందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్రవాయుగుండం విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, కాకినాడకు 960 కిలోమీటర్లు, బాపట్లకు 1130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉనట్లు అధికారులు తెలిపారు.
ఈ తీవ్రవాయుగుండం రేపటికి మరింత బలపడి తుఫాన్‌గా మారనుందని, దీనికి ‘అర్నాబ్’ అని నామకరణం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇది ఎల్లుండి ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెంది, బుధవారం నాటికి బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారీ వర్షాలు.. గాలుల తీవ్రత:
ఈ తుఫాన్ ప్రభావంతో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మత్స్యకారులకు హెచ్చరికలు:
సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.