రెండు రోజులు పాఠశాలలు సెలవులు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం : అర్నాబ్ తుఫాన్ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై అధికంగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ సూచనల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు మండపేట మండలంలోని అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలలకు అక్టోబర్ 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు మండపేట మండల విద్యాశాఖాధికారి నాయుడు రామచంద్రరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాల రికార్డులు, ఇతర సామగ్రి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు తుఫాన్ సమయంలో పాటించాల్సిన భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించాలని ఆదేశించారు. పాఠశాలల్లో తుఫాన్ ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే సంబంధిత సిబ్బందికి పాఠశాల తాళాలను తప్పనిసరిగా అప్పగించాలని తెలిపారు. ఆశ్రయ కేంద్రాలుగా వినియోగించే తరగతి గదుల్లోని స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ ప్యానెళ్లకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు జిల్లా కార్యాలయానికి ఫోన్‌లో అందుబాటులో ఉండాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించినట్లు ఎంఈవో నాయుడు రామచంద్రరావు పేర్కొన్నారు.