ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఘట్టం
అభ్యర్థులకు సమాన రక్షణ.. ఫిర్యాదులపై తక్షణ స్పందన
రాజకీయ పార్టీల సహకారానికి కలెక్టర్ పి. రాజాబాబు కృతజ్ఞతలు
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ప్రతి అభ్యర్థికి సమాన రక్షణ కల్పిస్తూ, ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. నామినేషన్లు వేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గురువారం కొంతమంది అభ్యర్థులు, మాజీ మంత్రులు చేసిన ఫిర్యాదులతో పాటు కాల్‌సెంటర్ ద్వారా అందిన వినతులపై తక్షణమే స్పందించామని తెలిపారు. ఎస్పీ, జాయింట్ కలెక్టర్, సబ్‌కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి సంబంధిత అభ్యర్థులకు అవసరమైన భద్రత కల్పించడంతో వారు ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. అనంతరం జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు సందేశాలు పంపారని కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటిస్తామని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పరిశీలన, ఉపసంహరణల ప్రక్రియలు పూర్తయిన అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.