ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
మెలియాపుట్టి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామస్తులు పోలీసులకు సహకరించాలని పాతపట్నం సీఐ కె. వెంకటరావు కోరారు. మెలియాపుట్టి మండలంలోని పెద్ద పద్మాపురం గ్రామంలో శనివారం ఆయన ఎస్సై మహమ్మద్ అమీర్ అలీతో కలిసి గ్రామస్తులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో చేయాల్సిన పనులు, చేయకూడని అంశాలపై ప్రజలకు వివరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.