BREAKING
ఉత్తరకాశీ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి-గుండ్రాంపల్లి పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌గా బండ అంజయ్య నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం డిస్కంల కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపునకు ఆదేశాలు చీఫ్ ఇంజనీర్ (ఎనర్జీ ఆడిట్) శ్రీ రంగనాథ్ హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ప్రతి 15 రోజులకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం – సీఎండీ జితేష్ వి. పాటిల్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (CCRUM) గవర్నింగ్ బాడీ మెంబర్‌గా శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ నియామకం బిజీ బిజీగా మేయర్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. ఆటో డ్రైవర్‌కు పునర్జన్మ సరంపేటలో ఉచిత వైద్య శిబిరం…యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు... కంభంపాడులో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉయ్యూరి అప్పారావుకు మద్దతుగా ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే తాతయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అరెస్ట్.. మతసామరస్యానికి ఆత్మీయ పలకరింపు.. నూరానీ జామియా మసీదులో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి మనం చూస్తున్న కాకినాడ మడ అడవుల కింద ఒకప్పటి ప్రపంచ ప్రసిద్ధ ఓడరేవు సమాధి అయి ఉందంటే నమ్ముతారా? రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాయి విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ డీలిమిటేషన్‌పై తగ్గేదేలేదు..

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. ఆటో డ్రైవర్‌కు పునర్జన్మ

Select Suryaa Now
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. ఆటో డ్రైవర్‌కు పునర్జన్మ

అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులు మరోసారి నిరూపించారు. అరుదైన హిప్ జాయింట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఓ నిరుపేద ఆటో డ్రైవర్‌కు నొప్పుల నుంచి ఉపశమనం కల్పించారు. ఆర్థో విభాగం, అనస్థీషియా విభాగం వైద్యుల సమన్వయం, ప్రత్యేక చొరవతో క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయడం ఆసుపత్రి వైద్య సేవలకు నిదర్శనంగా నిలిచింది.

నగరంలోని ఉమానగర్‌కు చెందిన లోకనాథ్ గౌడ్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. సుమారు రెండేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆయన హిప్ జాయింట్‌కు గాయాలయ్యాయి. అప్పట్లో పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, గత ఆరు నెలలుగా తుంటి భాగంలో తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. తొలుత మందులతో నయం అవుతుందని భావించి వైద్యులను సంప్రదించారు. అయితే రోజులు గడిచేకొద్దీ నొప్పి తీవ్రత పెరగడంతో నడవడానికి సైతం ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చారు.

రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్ వైద్యులు హిప్ జాయింట్ దెబ్బతిని అరిగిపోయినట్లు గుర్తించారు. సాధారణ మందులతో సమస్య పరిష్కారం కాదని, తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆర్థో విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ ఆత్మారాం, అనస్థీషియా విభాగం వైద్యులు డాక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.

శస్త్రచికిత్స అనంతరం లోకనాథ్ గౌడ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆయన సాధారణ స్థితికి చేరుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్ర నొప్పితో నడవలేని పరిస్థితి నుంచి కోలుకుంటుండటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందడం నిరుపేద కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చింది.

వైద్య బృందానికి ఉన్నతాధికారుల అభినందనలు

రోగికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఆర్‌ఎంఓ డాక్టర్ సుధారాణి, డాక్టర్ కిరణ్మయి వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం అందిస్తున్న వైద్య సేవలు, రోగి కోలుకుంటున్న తీరుపై ఆరా తీశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు, సమర్థవంతమైన వైద్య బృందాలు అందుబాటులో ఉంటే ఖరీదైన వైద్య చికిత్సలను సైతం పేదలకు చేరువ చేయవచ్చని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందుతుండటం విశేషం. వైద్యుల అంకితభావం, సమన్వయం, మానవీయ దృక్పథం రోగులకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.