ఉత్తరకాశీ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం
సూర్య జాతీయ డెస్క్: ఉత్తరకాశీ జిల్లా మోరి తహసీల్ పరిధిలోని పవానీ గ్రామంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అగ్నిప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఎం ధామి, నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో 39 ఇళ్లు పూర్తిగా దగ్ధం కాగా, 56 కుటుంబాలు నిరాశ్రయులుగా మారాయి. బాధితులను స్వయంగా కలిసి వారి సమస్యలను ఓపికగా విన్న ముఖ్యమంత్రి, ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
గ్రామంలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం ధామి, అగ్నిప్రమాద తీవ్రతను వివరించారు. రెండు రోజుల క్రితం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పవానీ గ్రామం దాదాపు పూర్తిగా కాలిపోయిందని, ప్రజలు కట్టుబట్టలతో మిగిలారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పశుసంపదకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపారు. శీతాకాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుందని, అందుకే గ్రామస్తులు ఆరు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, రేషన్ నిల్వ చేసుకున్నారని, అవన్నీ మంటల్లో కాలిబూడిదయ్యాయని పేర్కొన్నారు.
బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించడంతో పాటు, వారు తిరిగి సాధారణ జీవితం ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నష్టంపై సమగ్ర అంచనా వేసి అవసరమైన అదనపు సాయం కూడా అందించాలని సూచించారు. కుటుంబాలు పునరావాసం పొందే వరకు తాత్కాలిక వసతి కోసం అద్దె సాయం, రేషన్, వైద్య బృందాలు, కమ్యూనిటీ కిచెన్లు వంటి సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. జిల్లా మేజిస్ట్రేట్ ఇప్పటికే సంబంధిత అధికారులకు తక్షణ ఆశ్రయం, తాగునీరు, దుప్పట్లు ఇతర అత్యవసర ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రతికూల వాతావరణం, పర్వత ప్రాంత భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇళ్లు కోల్పోయిన కుటుంబాల పునర్నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే దుర్గేశ్వర్ లాల్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.