బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారానికి రెండేళ్లు
సూర్య జాతీయ డెస్క్: బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారం రెండో వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రత్యేక జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ హాజరుకానున్నారు. నవంబర్ 27, 2024న ప్రారంభమైన ఈ ప్రచారం ప్రభుత్వం మరియు సమాజం సమష్టి కృషితో ముందుకు సాగుతోంది. బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపి ప్రతి బిడ్డకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన, విద్యావంతమైన భవిష్యత్తు అందించాలనే సంకల్పాన్ని ఈ వేదిక ద్వారా మరోసారి బలోపేతం చేయనున్నారు.
ఈ జాతీయ సదస్సులో వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, బాల్య వివాహ నిషేధ అధికారులు, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ప్రతినిధులు, పౌర సమాజ సంస్థల సభ్యులు పాల్గొంటున్నారు. గత రెండేళ్లలో ఈ ప్రచారం సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు, క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న సిబ్బంది మరియు భాగస్వాముల సేవలను గుర్తించి సత్కరించనున్నారు. రాష్ట్రాల వారీగా అమలు చేస్తున్న ఉత్తమ కార్యక్రమాలను కూడా ప్రదర్శించనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 27వ తేదీని అంతర్జాతీయ బాల్య, ముందస్తు మరియు బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది.
బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, సమాజాన్ని చైతన్యవంతం చేయడం, బాల్య వివాహ నిషేధ అధికారుల వ్యవస్థను పటిష్టం చేయడం, ఘటనలను సకాలంలో రిపోర్ట్ చేసేలా ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనితో పాటు బాలికల విద్య, సాధికారత, శ్రేయస్సుకు పెద్దపీట వేస్తోంది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర, జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, యువత, మత పెద్దలు, పౌర సమాజ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక గ్రామసభలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, డిజిటల్ ప్రచారాలను ఉద్ధృతం చేస్తున్నారు.
బాల్య వివాహాల ఘటనలను సులభంగా రిపోర్ట్ చేయడానికి, బాల్య వివాహ నిషేధ అధికారుల వివరాలను తెలుసుకోవడానికి, అవగాహన కార్యక్రమాలను నమోదు చేయడానికి మరియు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడానికి ప్రత్యేక డిజిటల్ పోర్టల్ అందుబాటులో ఉంది. పౌరులు, వివిధ సంస్థలు ఈ పోర్టల్‌తో పాటు మైగవ్, మై భారత్ వేదికల ద్వారా ఈ ప్రచారంలో చురుగ్గా పాల్గొని ప్రతిజ్ఞ తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. నిరంతర సమన్వయం, ప్రజా భాగస్వామ్యంతోనే బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించగలమని ఈ జాతీయ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.