పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంజెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సోమవారం రాజానగరం ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఉత్సాహంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఉద్యోగులతో మాట్లాడారు. పోలింగ్ కోసం కల్పించిన ఏర్పాట్లు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో సుమారు 3 వేల మందికి పైగా ఎన్నికల సిబ్బంది తమకు ఓటు హక్కు కలిగిన మండలాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 5న నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారి, జిల్లా సహకార అధికారి ఎం. వెంకటరమణ, ఎంపీడీఓ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.