తెల్లాపూర్‌లో అక్రమ బోర్‌వెల్ కేంద్రాలపై అధికారుల దాడులు
రామచంద్రపురం;అనుమతులు లేకుండా భూగర్భ జలాలను వెలికితీసి ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్న అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా, రెవెన్యూ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. తెల్లాపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నీటిని వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన బోర్‌వెల్ పాయింట్లను స్వాధీనం చేసుకున్నారు.తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా) తరఫున అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, రెండు రోజులుగా స్థానిక నివాసితులు అర్ధరాత్రి వరకు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అక్రమ నీటి వెలికితీత కేంద్రాలపై చర్యలు తీసుకున్నారు.అధికారుల తక్షణ స్పందనపై తేనా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కొన్ని కేంద్రాలపై మాత్రమే చర్యలు తీసుకుంటే సమస్య పరిష్కారం కాదని, తెల్లాపూర్ పరిధిలోని అన్ని అక్రమ బోర్‌వెల్ పాయింట్లను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని కోరారు. అక్రమ నీటి వ్యాపారానికి పాల్పడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.స్వాధీనం చేసుకున్న బోర్‌వెల్ పాయింట్ల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, తిరిగి అక్రమంగా నీటి వెలికితీత జరగకుండా నిఘా ఉంచాలని సూచించారు. వేలాది కుటుంబాలు నివసిస్తున్న తెల్లాపూర్‌లో భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తే భవిష్యత్తులో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు సమగ్ర చర్యలు చేపట్టి భూగర్భ జలాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని నివాసితులు కోరుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తేనా ప్రతినిధులు స్పష్టం చేశారు.