పొన్నీటిపాళ్యం సర్పంచ్ బరిలో తిరుమలశెట్టి లావణ్య : నామినేషన్ దాఖలు చేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి కోడలు
మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : మదనపల్లి మండలం,పొన్నిటిపాళ్యం గ్రామఅభివృద్ధికి ఎనలేని సేవలందించి,ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి కోడలు తిరుమలశెట్టి లావణ్య పొన్నీటిపాళ్యం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థినిగా ఆదివారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.పసుపులేటి చలపతి కుమారుడు పసుపులేటి శశికుమార్ సతీమణి లావణ్య,తమ కుటుంబం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ప్రజాసేవా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నికల బరిలోకి దిగారు.నామినేషన్ కార్యక్రమానికి గ్రామపెద్దలు,చలపతి అభిమానులు,యువకులు మరియు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి,తమ ఆడపడుచుకు/కోడలికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.నామినేషన్ అనంతరం లావణ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి కోడలిగా మీ ముందుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.మా మామ ఈ గ్రామానికి చేసిన సేవలే నాకు శ్రీరామరక్ష అన్నారు.ఆయన ఆశయాలను,ఆయన వేసిన అభివృద్ధి బాటను మరింత ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధాన లక్ష్యమన్నారు.గ్రామంలో మౌలిక వసతుల కల్పన,తాగునీరు,పారిశుద్ధ్యం,ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరుస్తానన్నారు.చలపతి కుటుంబంపై మీకున్న నమ్మకంతో నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు.పసుపులేటి చలపతి హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేసుకుంటూ తిరిగి అదేస్థాయి పాలన కోసం లావణ్యని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని గ్రామస్తులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి