పొదలకూరులో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా
పొదలకూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం పొదలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.