పేదల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం
పేదల సేవలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది: మంత్రి సుభాష్
రామచంద్రపురం మేజర్ న్యూస్ : రామచంద్రపురం మండలం వేలంపాలెం గ్రామంలో నిర్వహించిన “పేదల సేవలో” కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా గౌరవప్రదంగా జీవించేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తోందని తెలిపారు.
ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, పేదల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకే అన్నపూర్ణ, పింకీ సాంబశివరావు, కొత్తపల్లి అరుణ, టేకుమూడి సత్యనారాయణ, పాలిక శ్రీను, రవ్వా భూషణం కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం లోక్ సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగి 75 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.