పసపుమాయమైన మలయానుర్, ఎమ్మెల్యే ప్రచారానికి భారీ స్పందన.
కళ్యాణదుర్గం: కుందుర్పి మండలం మాలయనూరు గ్రామం పసుపుమయంగా మారింది. కూటమి జడ్పీటీసీ అభ్యర్థి జీఎల్ ప్రభావతి, మండలంలోని 15 మంది ఎంపీటీసీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు, టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. గ్రామంలో ఎటుచూసినా పసుపు జెండాలు రెపరెపలాడగా, డప్పులు, డ్రమ్స్ మోతలు, కార్యకర్తల నినాదాల మధ్య ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గజమాలలు వేసి, పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటానని, వారి సమస్యల పరిష్కారానికి, ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య పాలన కారణంగానే ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో పాటు తాగునీటి ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు గత ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలకు మూడు విడతల్లో నిధులు కేటాయించి గ్రామీణ పాలనకు బలం చేకూర్చారని పేర్కొన్నారు. అయితే గతంలో వైసీపీ పాలనలో కొందరు సర్పంచులు నిధుల వినియోగంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జంబగుంపుల ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ప్రస్తుతం అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. అనుమతులు లభించిన వెంటనే రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. వచ్చే జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్యాణదుర్గం ప్రాంతానికి రానున్నారని, అదే సందర్భంలో రిజర్వాయర్ అంశంపై ముఖ్యమంత్రి చేత ప్రకటన చేయించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. అలాగే జనవరిలో కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయంగా ప్రజాసేవకు ప్రాధాన్యత ఇచ్చే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచిస్తూ, వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఎంపికపై విమర్శలు గుప్పించారు. వైసీపీ మట్కా వ్యాపారంతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. కర్ణాటకలో పెట్టుబడులు పెడుతున్నారంటూ విమర్శలు చేశారు. అందుకు భిన్నంగా టీడీపీ సామాన్య రైతు కూలీ కుటుంబానికి చెందిన జీఎల్ ప్రభావతిని జడ్పీటీసీ అభ్యర్థిగా నిలబెట్టిందని పేర్కొన్నారు. సామాన్యులకు రాజకీయ అవకాశాలు కల్పించడం కూటమి లక్ష్యమని అన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతోనే ఏకగ్రీవాల కంటే ప్రజల తీర్పుతో విజయం సాధించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పలువురు వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని ఏకగ్రీవానికి సహకరిస్తామని చెప్పినప్పటికీ తాను అంగీకరించలేదని, ప్రజల మద్దతుతోనే కూటమి అభ్యర్థులు గెలవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయని ప్రస్తావిస్తూ, గతంలో ఏకగ్రీవాలపై వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. పులివెందులలోనూ ఏకగ్రీవాలు జరిగిన నేపథ్యంలో ఆయన వైఖరిపై ప్రశ్నలు సంధించారు. చివరగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొంటూ, జడ్పీటీసీ అభ్యర్థి జీఎల్ ప్రభావతితో పాటు 15 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజలను కోరారు. మాలయనూరులో కనిపించిన ప్రజా స్పందన కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.