పొగాకు వినియోగానికి దూరంగా ఉండండి
రేణిగుంట:పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ కామరాజు కోరారు. శుక్రవారం రేణిగుంట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు హెల్త్ సూపర్వైజర్ కామరాజు విద్యార్థులు- మానసిక ఆరోగ్యం పొగాకు ఉత్పత్తుల వాడకం- దుష్ప్రభావాలు పై గాజులమండ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులైన చుట్ట,బీడీ, సిగరెట్,జర్దా,గుట్కా, మోవా,ఖైనీ తదితర పదార్థాలు,గాంజా వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు. పొగాకు వినియోగం నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు,శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుందని తెలిపారు.చిన్న వయస్సులోనే చెడు అలవాట్లకు బానిసలైతే భవిష్యత్తు ఆరోగ్యం దెబ్బతింటుందని, విద్యార్థులు పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుల ఒత్తిడి,పరీక్షల భయం,కుటుంబ సమస్యలు,స్నేహితులతో తలెత్తే విభేదాలు వంటి కారణాలతో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని వివరించారు.మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమైనదని, మనసులోని బాధలను దాచుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలని సూచించారు.ప్రతిరోజూ వ్యాయామం,యోగా, ధ్యానం,క్రీడలు,మంచి నిద్ర, పోషకాహారం అలవాటు చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు. ఆందోళన,నిరాశ, ఒంటరితనం వంటి సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.విద్యార్థులు తమ జీవితంలో మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.పొగాకు రహిత సమాజ నిర్మాణంతో పాటు మానసికంగా ఆరోగ్యవంతమైన యువతను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ శ్రీ వేణుగోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆశాకార్యకర్త ఛాముండేశ్వరి పాల్గొన్నారు.