20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు, అక్టోబర్ 30 : స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నవంబర్ 1న ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను అనుమతించింది. ఓటరు గుర్తింపు కార్డు (EPIC) లేని పక్షంలో ఎన్నికల సంఘం సూచించిన క్రింది 20 రకాల ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని పోలింగ్ కేంద్రంలో చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్, మాజీ సైనికుల పెన్షన్ పుస్తకం, వృద్ధాప్య, వితంతు పెన్షన్ పత్రాలు, ఫొటోతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్టాఫీసులు, APCOB, DCCBలు జారీ చేసిన ఫొటో పాస్‌బుక్‌లు, కిసాన్ పాస్‌బుక్‌లు, బ్యాంకులు జారీ చేసిన ఫొటోతో కూడిన ఏటీఎం కార్డులు, ఫొటోతో కూడిన రేషన్ కార్డులు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డులు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, సంబంధిత అధికార సంస్థ జారీ చేసిన ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువీకరణ పత్రాలు, ఫొటోతో కూడిన స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్సులు, సంబంధిత అధికారి జారీ చేసిన ఫొటోతో కూడిన దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, బార్ కౌన్సిళ్లు జారీ చేసిన ఫొటోతో కూడిన సభ్యత్వ కార్డులు, కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ, శాసనమండలి సచివాలయాలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, ఎంపీలకు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.