ఎల్ వి ప్రసాద్ లో డయాబెటిక్ రెటినోపతి పై అవగాహన
ఆరిలోవ, సూర్య : విశాఖ ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్యశాల, జిఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ వద్ద మధుమేహా వ్యాధిగ్రస్తులకు డయాబెటిక్ రెటినోపతి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కంటిలో రెటీనా ఒక ముఖ్యమైన భాగం. రక్తంలో చక్కెర (షుగర్’) స్థాయిలు చాలకాలంగా అధికంగా ఉంటే రెటీనాకు నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల చదివేటప్పుడు క్రమంగా చూపు మసకబారడం లేదా చూపు కోల్పోవడం, చివరికి శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితినే డయాబెటిక్ రెటినోపతి అంటారు. కంటికి తీవ్ర నష్టం కలిగే వరకు ఈ సమస్య ఉన్నట్లు తెలియదు. చాలా కాలం పాటు నియంత్రణలో లేని మధుమేహం, గర్భధారణ సమయంలో మధుమేహం ఉండటం, అధిక రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, మూత్రపిండాల సమస్యలు డయాబెటిక్ రెటినోపతికి ప్రధాన కారణాలు అని వివరించారు. సాధారణంగా కంటి లేదా రెటీనా పరీక్ష చేయించుకున్నప్పుడు ఈ విషయం బయటపడుతుంది. మధుమేహంతో కళ్ళు సరిగా కనిపించని వారు నేత్ర వైద్య నిపుణుడిని లేదా రెటీనా నిపుణుడిని సంప్రదించాలి. ఈ సందర్భంగా డాక్టర్. విశాల్ సంజయ్ యాదవ్, కన్సల్టెంట్ నేత్ర ,ఎల్వీ ప్రసాద్ వైద్య నిపుణు మాట్లాడుతూ ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే డయాబెటిక్ రెటినోపతి క్రమంగా తీవ్రమయ్యే అవకాశం ఉందని, మీకు మధుమేహం ఉంటే, చూపు స్పష్టంగా ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం సమగ్ర కంటి పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని, రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా కంటి చూపును కాపాడుకోవచ్చు." అన్నారు. డయాబెటిక్ రెటినోపతికి లేజర్ చికిత్స లేదా కంటిలోకి ఇంజెక్షన్ల ద్వారా చికిత్స అందించవచ్చు. వ్యాధి మరింత తీవ్రం కాకుండా నిరోధించడానికి అవసరమైన సందర్భాల్లో శస్త్రచికిత్స కూడా చేయవచ్చు, ప్రతి సంవత్సరం సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవడం ద్వారా జీవితాంతం కంటి చూపును కాపాడుకోవచ్చు అని పేర్కొన్నారు.