భూభారతి రీ-సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం!
వర్గల్, : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి–రీ-సర్వే కార్యక్రమం ద్వారా భూ యజమానుల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు రెవెన్యూ వ్యవస్థను, భూ రికార్డులను మరింత పటిష్టం చేయనున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. వర్గల్ మండలం సీతారాంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన భూభారతి–రీ-సర్వే అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
103 గ్రామాల్లో సర్వే ప్రక్రియ
జిల్లాలో ఇప్పటివరకు రెండు విడతల్లో 103 గ్రామాల్లో సర్వే ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. ముందుగా ఆయా మండలాల్లో చిన్న గ్రామాలను ఎంపిక చేసుకుని సర్వే నిర్వహించడం ద్వారా భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. భూ రికార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఆధునిక సాంకేతికతతో భూముల సర్వే
సీతారాంపల్లి గ్రామ పరిధిలో సుమారు 390 ఎకరాల విస్తీర్ణంలో రీ-సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆధునిక రోవర్ పరికరాల సహాయంతో డిప్యూటీ తహసీల్దార్ (డీటీ), సర్వేయర్, గ్రామ ప్రణాళిక అధికారి (జీపీఓ) రోజుకు 35 నుంచి 40 ఎకరాల వరకు సర్వే చేస్తున్నట్లు వివరించారు.ముందుగా గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, కాలిబాటలను సర్వే చేసిన అనంతరం పట్టా భూముల సర్వే చేపడతామని తెలిపారు. భూ యజమానులు, రైతులకు ఒక రోజు ముందుగానే సమాచారం అందించి, వారి సమక్షంలోనే భూముల సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సర్వేలో సందేహాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి
రీ-సర్వే ప్రక్రియను రైతులు, భూ యజమానులు ప్రత్యక్షంగా గమనించాలని కలెక్టర్ సూచించారు. సర్వే సమయంలో ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సర్వే ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తోందని, ఇందుకు రైతులు, భూ యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.భూముల సర్వే నంబర్లలో గందరగోళం, భూ హద్దుల వివాదాలు, ఇతర రెవెన్యూ సమస్యలు ఉన్నవారు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులో సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
భూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులదే కీలక పాత్ర
గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు భూభారతి–రీ-సర్వే కార్యక్రమంపై గ్రామ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజలకు వివరించి, రైతులు, భూ యజమానులకు పూర్తి సమాచారం అందించాలని కోరారు. గ్రామంలో భూ సమస్యలను పరిష్కరించి, వివాదాలు లేని గ్రామంగా సీతారాంపల్లిని తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, సర్వే అధికారులు, గ్రామ సర్పంచ్ అండాలు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.