పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్
సూర్య టెక్నాలజీ డెస్క్: పిల్లల కోసం రూపొందించే డిజిటల్ విద్యా సంబంధిత వీడియోలలో కనిపించే కదిలే నేపథ్యాలు లేదా యానిమేషన్లు వారిని స్క్రీన్‌కు కట్టిపడేస్తునప్పటికీ, వాస్తవానికి ఆ అభ్యాసన నాణ్యతను మెరుగుపరచడంలో అవి అంతగా దోహదపడవని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో తేల్చిచెప్పారు. ప్రసిద్ధ పిల్లల యూట్యూబ్ ఛానెళ్ల నుంచి వేలాది వీడియోలను విశ్లేషించడంతో పాటు, క్షేత్రస్థాయి ప్రయోగాలు, చిన్న పిల్లల కంటి కదలికలను ట్రాక్ చేయడం ద్వారా ఈ కీలక విషయాలను పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. విజువల్ మోషన్ కారణంగా పిల్లల వీక్షణ సమయం పెరుగుతున్నప్పటికీ, ఆ అదనపు శ్రద్ధ అంతా ప్రధాన బోధనాంశంపై కాకుండా కేవలం కదిలే బ్యాక్‌గ్రౌండ్ ఎలిమెంట్స్‌పైనే ఎక్కువగా ఉంటోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఈ పరిశోధనలో భాగంగా పిల్లల ప్రవర్తనను పరిశీలించగా, వీడియోలలో విజువల్ మోషన్ ఉండటం వల్ల పిల్లలు పరధ్యానానికి గురైనప్పటికీ తిరిగి త్వరగా స్క్రీన్‌పై దృష్టి పెట్టడానికి ఇది కొంతవరకు సహాయపడుతున్నట్లు తేలింది. అయితే దీనివల్ల విషయాన్ని గ్రహించే సామర్థ్యం లేదా జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు. కదిలే నేపథ్యాలు ఉన్న వీడియోలు సాధారణ వీడియోలతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ వ్యూయూ రేట్లను సాధిస్తున్నప్పటికీ, ఆ విజువల్స్ అన్నీ కేవలం స్క్రీన్‌ను ఉత్తేజపరిచేలా ఉంటున్నాయే తప్ప పాఠాన్ని సులభంగా అర్థం చేసుకునేలా ఉండటం లేదని తేలింది. ఎక్కువ యానిమేషన్లు ఉండటం ఎప్పుడూ మెరుగైన ఫలితాలను ఇస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పరిశోధకులు స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు ఈ తాజా అధ్యయనం ద్వారా కీలక విషయాలను గ్రహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ ముందు గడుపుతున్నారనే కారణంతో ఆ వీడియోల ద్వారా మెరుగైన విజ్ఞానం అందుతోందని భావించలేమని హెచ్చరిస్తున్నారు. కేవలం కాలక్షేపం కోసం లేదా నిరంతర ఉత్తేజం కోసం కాకుండా, భావనలను స్పష్టంగా వివరించేలా ఉద్దేశపూర్వకంగా యానిమేషన్లను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో డిజిటల్ విద్యా కంటెంట్‌ను రూపొందించేటప్పుడు కేవలం వ్యూస్ పెంచుకోవడం కంటే పిల్లల వాస్తవ అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా డిజైన్ విధానాలు ఉండాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.