స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించి జగన్ కు బహుమతిగా అందించాలి
పూసపాటిరేగ, సూర్య : పూసపాటిరేగ మండలం స్థానిక సంస్థలు ఎన్నికల్లో వైకాపా తరపున జడ్పిటిసి స్థానంతో పాటు ఎంపీటీసీ అభ్యర్థుల అత్యధిక స్థానాలను విజయం సాధించడం ద్వారా వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందించడమే తన ముందున్న లక్ష్యం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత, బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు అన్నారు. పూసపాటిరేగ మండలంలోని కనిమెల్ల, అల్లాడ పాలెం, కనిమెట్ట, గుండపరెడ్డి పాలెం, కందివలస, గోవిందపురం, బర్నికాం గ్రామాల్లో స్థానిక సంస్థలు ఎన్నికల ప్రచారాన్ని లక్ష్మణరావు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందపురం, కనిమెళ్ళ, కందివలస ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పట్టెపు శ్రీనివాసరావు, కాకి సత్యవతి, సాంతాడ రమ్య, జడ్పిటిసి తరఫున పోటీ చేస్తున్న బహంతి శివలకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రజల శ్రేయస్సు కోరే బొత్స కుటుంబం పూసపాటిరేగ మండలంలో రెండు దశాబ్దాలుగా అనుబంధంగా ఉంటూ ప్రజాసేవ చేస్తున్నామని, గతంలో రాజకీయాల కతీతంగా సేవ చేస్తూ వస్తున్న తన ఆదరభిమానాలను స్థానిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించి వైకాపా అధినేత జగన్ కు, శాసనమండలి ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ కు బహుమతిగా అందించాలని ఈ సందర్భంగా ఎంపీటీసీ సెగ్మెంట్లలో ఉన్న ఓటర్లను లక్ష్మణరావు అభ్యర్థించారు. తన మద్దతు దారులను గెలిపిస్తే భవిష్యత్తులో గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తానన్న ఆశాభావాన్ని లక్ష్మణరావు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ రమేష్, వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.