కాళేశ్వరం వైఫల్యానికి బీఆర్ఎస్ తప్పిదాలే కారణంః మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, నాణ్యతా లోపాలే కారణమని మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితికి అప్పటి సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ధనదాహంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్‌డీఎస్‌ఏ సభ్యుడు సమీర్ కుమార్ శుక్లే స్పష్టమైన నివేదిక ఇచ్చారని అనిల్ పేర్కొన్నారు. తొలుత సాంకేతిక కమిటీ స్టిల్లింగ్ బేస్ మరమ్మతులు చేపట్టాలని భావించినప్పటికీ, లోతైన అధ్యయనం అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలోనే నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించి మరమ్మతుల ప్రక్రియను నిలిపివేసిందని తెలిపారు. బ్యారేజీలు నిర్మించాల్సిన ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో, శాస్త్రీయ ప్రమాణాలను పాటించకుండా నిర్మించారని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొన్నట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాధ్యుడిని చేయడం సరికాదని అన్నారు. బ్యారేజీ గేట్లు మూసివేయవద్దని ఎన్‌డీఎస్‌ఏ సూచిస్తుంటే, నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎవరిమాట వినాలని ప్రశ్నించారు. ఎన్‌డీఎస్‌ఏ సాంకేతిక నిపుణుల సూచనల కంటే బీఆర్ఎస్ నేతల అభిప్రాయాలే గొప్పవా? అని నిలదీశారు. కృష్ణా జలాల విషయంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టిందని ఇరవత్రి అనిల్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టిన పలు ప్రాజెక్టులు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని విమర్శించారు. కాళేశ్వరం, కృష్ణా జలాల అంశాల్లో గత ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి కష్టాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తూ, ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ తెచ్చిన కరువేనని వ్యాఖ్యానించారు.
ఎ.రవీందర్ సూర్య తెలంగాణ బ్యూరో ప్రతినిధి