పల్లెలకు రహదారి వరాలు
రూ.4.50 కోట్ల పనులకు శంకుస్థాపన
పింఛన్ల పంపిణీ చేసిన ఎరిక్షన్‌బాబు
పుల్లలచెరువు, మేజర్ న్యూస్.
మండలంలోని పలు గ్రామాలకు రహదారి వరాలు దక్కాయి. పల్లె పండుగ-3.0లో భాగంగా వివిధ గ్రామాల్లో రూ.4.50 కోట్లతో చేపట్టనున్న సీసీ, తారు రహదారి పనులకు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు గురువారం శంకుస్థాపనలు చేశారు. తొలుత ఐటీ వరం పంచాయతీ గండిబావిగూడెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందజేశారు.
అనంతరం గండిబావిగూడెంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. సిద్ధెనపాలెంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఐటీ వరం పంచాయతీ రెంటపల్లిలో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న నూతన తారు రోడ్డుకు, గంగవరం పంచాయతీలో రూ.2 కోట్లతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కొమ్మరోలు పంచాయతీ కుందంపల్లిలో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న నూతన తారు రోడ్డుకు కూడా శంకుస్థాపన చేశారు.
ఒకే రోజు మండలంలోని పలు గ్రామాల్లో కోట్లాది రూపాయలతో రహదారి పనులు ప్రారంభం కావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రహదారుల నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు రవాణా సౌకర్యం సులభతరం కానుంది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోట్ల గోవిందు,నాయకులు శనగ నారాయణ రెడ్డి,సుబ్బారెడ్డి, గజ్వల్లి భాస్కర్,గద్దె మల్లయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.