ఒంగోలు నియోజకవర్గంలో 193 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు మంజూరు ,పత్రాల పంపిణీ చేసిన శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్
సూర్య ఒంగోలు :ఒంగోలు నియోజకవర్గ పరిధిలో అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ పథకానికి ప్రాధాన్యతనిస్తోందని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు తెలిపారు. శనివారం ఒంగోలు నగరంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని మొత్తం 193 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ శాఖ ద్వారా మంజూరైన ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒంగోలు నగర పరిధిలో 153 మంది లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో గృహ నిర్మాణాలు చేపట్టేందుకు మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కొత్తపట్నం మండల పరిధిలో 40 మంది లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.2.89 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు మొత్తం 523 గృహాల నిర్మాణానికి సంబంధించి రూ.14.62 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఇంటి స్థలం ఉండి, సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనే ఆసక్తి ఉన్న అర్హులైన వారు గృహ నిర్మాణ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకొని, సంబంధిత అధికారులను సంప్రదించి అవసరమైన దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గృహ నిర్మాణ కార్యక్రమాల అమలులో లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.