న్యాయ అవగాహనతో చైతన్యవంతమైన సమాజ స్థాపన సాకారం -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు : న్యాయ అవగాహనతోనే సంపూర్ణ జాగృతితో కూడిన చైతన్యవంతమైన సమాజ స్థాపన సాకారమవుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజలెదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులకు చెక్ పెట్టేందుకూ, వివిధ అంశాలపై వారికి అవగాహన కల్పించేందుకూ న్యాయ సలహా కేంద్రం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేవలం రాజకీయ వేదికగానే కాకుండా, ప్రజలకు సమగ్ర సేవలను అందించే సంక్షేమ కేంద్రంగా మారుతుండడంతో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇటు ప్రజల మన్ననలతో పాటూ అటు రాష్ట్రాధినేతల ప్రశంసలు సైతం అందుకుంటూ రావడం అభినందనీయమనే చెప్పాలి. కాగా,,, ఎమ్మెల్యే బడేటి చంటి చేపడుతోన్న వినూత్న తరహా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో పాటూ ఇతర ప్రజా ప్రతినిధులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు
. ప్రజలు తమ సమస్యలను ఎప్పుడైనా నేరుగా తెలియజేసేందుకు వీలుగా నిత్యం వినతులు స్వీకరించడం ఎంతో ఆదర్శమనే చెప్పాలి. ఇక నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు, మందులు అందిస్తూ ఆరోగ్య భరోసా కల్పించడం కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఉచిత వైద్య శిబిరం నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యే బడేటి చంటిని ప్రత్యేకంగా అభినందించడం ఎంతో విశేషం. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం నిర్ధిష్టమైన వేదికే ప్రజాదర్బార్. ఇదే తరహాలో చట్టపరమైన సమస్యలతో సతమతమయ్యే సామాన్యులకు ఉచితంగా న్యాయ సలహాలు, మార్గదర్శకత్వం అందించడానికి ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే సదాలోచనతోనే న్యాయ సలహా కేంద్రాన్ని ఈ మంగళవారం నుండి వారంవారం నిర్వహించేలా ఆలోచన చేశారు. ఈ ఆలోచనకు ఈ మంగళవారం నాంది పలుకుతూ న్యాయ సలహా కేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు.
వినూత్న సేవలకు తార్కాణంగా నిలిచే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రారంభమైన న్యాయ సలహా కేంద్రంలో మొత్తం 7గురు న్యాయవాదులు ప్రజల న్యాయపరమైన సమస్యలను స్వీకరించారు. ఏలూరు పార్లమెంట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ పి. సాయి రమేష్, ఏలూరు లీగల్ సెల్ కార్యదర్శి ఎమ్వీ సురేష్, టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పుచ్చల వెంకట్, కె. కన్నబాబు, జేఎమ్‌వివి ప్రసాద్, సిహెచ్‌ఎన్ శిరీషా దేవి, ఆర్ కిషోర్ కుమార్‌లు ప్రజలెదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వారికి తగు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ హక్కులతో పాటూ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండటం వల్లనే చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని అభిప్రాయపడ్డారు.
దీనివల్ల అనేక సామాజిక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. చట్టాలపై అవగాహన ఉన్నప్పుడు మోసాలు, అన్యాయాలను సులభంగా గుర్తించి, తమను తాము రక్షించుకోగలుగుతారన్నారు. హక్కులతో పాటు తమ బాధ్యతలను కూడా గుర్తించి, చట్టాన్ని గౌరవించే ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకుంటారని ఆయన వెల్లడించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే న్యాయ సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు బెల్లపుకొండ కిషోర్, పలువురు మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.