నిలిచిపోయిన బలిజ కళ్యాణమండపం కు 30 లక్షలు ఎంపీ నిధులు
కళ్యాణదుర్గం: పట్టణంలోని బలిజ కళ్యాణమంటపం నిర్మాణ పనులకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శంకుస్థాపన చేశారు. బలిజ సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ప్రారంభమైన కళ్యాణమంటపం నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో వాటిని తిరిగి ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో నిధులు సమకూర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణం పూర్తయితే బలిజ సామాజిక వర్గ ప్రజలకు వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైన సందర్భాల్లో దాతలు, ఇతర సంస్థల సహకారంతో కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి సామాజిక వర్గానికి కళ్యాణమంటపం ఉండాలనే ఉద్దేశంతో అందుబాటులో ఉన్న నిధులను ఇటువంటి నిర్మాణాలకు కేటాయించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన బలిజ కళ్యాణమంటపం నిర్మాణం అనంతరం వివిధ కారణాలతో నిలిచిపోయిందని వివరించారు. ఎన్నికలకు ముందు నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో రూ.10 లక్షలు అందించినట్లు తెలిపారు. అయినప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో బెంగళూరుకు చెందిన ఇతర సంస్థలు, కంపెనీల సహకారంతో మరో రూ.15 లక్షలు సమకూర్చేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. అయినా నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, ఆయన సహకారంతో రూ.30 లక్షల ఎంపీ నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, అన్ని సదుపాయాలతో కళ్యాణమంటపాన్ని పూర్తి చేసి బలిజ సామాజిక వర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణ పనులను నాణ్యతతో, ప్రణాళికాబద్ధంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాజిక వర్గాల అవసరాలను గుర్తించి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సహకారంతో కళ్యాణమంటపం నిర్మాణానికి నిధులు సమకూరడంపై బలిజ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తయితే కళ్యాణదుర్గం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టౌన్ రిపోర్టర్ :-రంగస్వామి.