వడ్డే ఓబన్న కళ్యాణ మండపానికి భూమి పూజ. 55 లక్షలు ఎంపీ నిధులతో నిర్మాణం.
కళ్యాణదుర్గం: పట్టణంలోని వడ్డే కాలనీలో వడ్డే ఓబన్న కళ్యాణమంటపం నిర్మాణానికి ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భూమిపూజ చేశారు. ఎంపీ నిధులు రూ.55 లక్షలతో ఈ కళ్యాణమంటపాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సామాజిక వర్గ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సోదరులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. సమాజ అభివృద్ధిలో ప్రతి వర్గానికి భాగస్వామ్యం కల్పించాలని పేర్కొన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వడ్డెర సోదరుల కళ్యాణమంటపం కల నేడు సాకారమవుతోందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల కోసం ఎంపీ నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు. ఆదరణ పథకం మూడో విడత ద్వారా వడ్డెర వృత్తిదారులకు రాయితీపై పనిముట్లు, అవసరమైన పరికరాలు అందిస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, తన ఎన్నికలో వడ్డే కాలనీ ప్రజలు అత్యధిక మెజార్టీ అందించారని, వారి అభిమానాన్ని ఎప్పటికీ మరచిపోనని అన్నారు. వడ్డెర సోదరులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. వడ్డే ఓబన్న కళ్యాణమంటపాన్ని నాణ్యతతో, అన్ని సదుపాయాలతో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వారికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రస్తుతం ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు అందుతాయని, వాటితో గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయస్థానాల్లో కేసులు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మరోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. వడ్డెర సామాజిక వర్గ సంక్షేమం, విద్య, ఉపాధి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సామాజిక వర్గ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టౌన్ రిపోర్టర్ :-రంగస్వామి