BREAKING
పులకుర్తి రంగయ్య దేవస్థానానికి రూ.1.01 లక్షల విరాళం బంగారం కొనేవారికి ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్, సిల్వర్ ధరలు ఇవే! మండపేట మున్సిపల్ ఎన్నికల్లో హోరా హోరి పోరు గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌దారుడు దుర్మరణం ఏడేళ్ల తర్వాత రాజమహేంద్రవరం కు మహాఎన్నికలు వడ్డే ఓబన్న కళ్యాణ మండపానికి భూమి పూజ. 55 లక్షలు ఎంపీ నిధులతో నిర్మాణం. పెద్దవీధిలో వైభవంగా దేవీ నవ రాత్రులు నిలిచిపోయిన బలిజ కళ్యాణమండపం కు 30 లక్షలు ఎంపీ నిధులు దేవులనాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం

మండపేట మున్సిపల్ ఎన్నికల్లో హోరా హోరి పోరు

Select Suryaa Now
మండపేట మున్సిపల్ ఎన్నికల్లో హోరా హోరి పోరు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

మండపేట మున్సిపల్ ఎన్నికలంటేనే రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకం. పురపాలక సంఘం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడి ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. దశాబ్దాలుగా రాజకీయ చైతన్యానికి వేదికగా నిలిచిన మండపేట మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే 1987లో కాంగ్రెస్, 2021లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించగా, మధ్యలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తాజాగా 2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

1952లో మున్సిపాలిటీగా ఆవిర్భావం.…

1952లో మండపేట మున్సిపాలిటీగా ఏర్పడింది. అంతకుముందు పంచాయతీపై తిరుగులేని పట్టు సాధించిన దివంగత సర్దార్ వేగుళ్ల వీర్రాజు సర్పంచ్‌గా వ్యవహరించేవారు. మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన అనంతరం ఆయన తొలి మున్సిపల్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ స్థానిక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.1982లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు అప్పట్లో తీవ్ర ఉత్కంఠ రేపాయి. సర్దార్ వేగుళ్ల వీర్రాజు ప్యానల్ కాకడ గుర్తుపై పోటీ చేయగా, మాజీ ఎమ్మెల్యే దివంగత వల్లూరి నారాయణరావు ప్యానల్ పులి గుర్తుపై బరిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో వేగుళ్ల వీర్రాజు ప్యానల్ అనూహ్య విజయాన్ని సాధించింది. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో వల్లూరి నారాయణరావు టీడీపీలో చేరి, అప్పటి ఆలమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

1987లో కాంగ్రెస్ విజయకేతనం.…

1987 మార్చిలో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో మండపేట మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం తొలిసారిగా మహిళా జనరల్‌కు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి సతీమణి డాక్టర్ బిక్కిన విజయ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా దివంగత డాక్టర్ పాలడుగుల సత్యవతి బరిలో నిలిచారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గం కు చెందిన వారు కావడం విశేషం. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ బిక్కిన విజయ విజయం సాధించి చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

1995లో టీడీపీకి పట్టం.…

1995 మార్చి 19న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. అప్పట్లో దివంగత మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున చేనేత వర్గానికి చెందిన దివంగత ఇనుమర్తి వీరసభద్ర పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా అదే చేనేత వర్గం నుంచి  దొరా శారదాదేవి బరిలో నిలిచారు. ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో ఇనుమర్తి వీరసుభద్ర విజయం సాధించారు. అత్యధిక కౌన్సిలర్ స్థానాలను సైతం టీడీపీ కైవసం చేసుకుని మున్సిపాలిటీపై తన పట్టును నిరూపించుకుంది.

2000 ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వేగుళ్ల జోగేశ్వరరావు.…

2000లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మండపేట చైర్మన్ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయగా, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి బరిలో నిలిచారు. వీరిద్దరు కమ్మ సామాజిక వర్గం కు చెందిన వారే.టీడీపీ, బీజేపీ కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నాయి. అత్యధిక కౌన్సిలర్ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. చైర్మన్ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరిపై వేగుళ్ల జోగేశ్వరరావు విజయకేతనం ఎగురవేశారు. ఈ విజయంతో మండపేట రాజకీయాల్లో ఆయన ప్రస్థానం కీలక మలుపు తిరిగింది.

2005లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా టీడీపీదే పైచేయి.…

2005లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ ఎంపికకు పరోక్ష పద్ధతిని అమలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే  వల్లూరి  నారాయణరావు కోడలు వల్లూరి విమలకుమారిని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించనప్పటికీ, అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి మేనల్లుడు రెడ్డి రాధాకృష్ణ సతీమణి రెడ్డి కృష్ణకుమారిని చైర్‌పర్సన్‌గా చేయాలని భావించారు. ఆమె 18, 25 వార్డుల నుంచి పోటీ చేయగా, రెడ్డి రాధాకృష్ణ 27, 11 వార్డుల్లో బరిలో నిలిచారు.ఈ ఎన్నికలను టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న వేగుళ్ల జోగేశ్వరరావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఫలితాల్లో అత్యధిక స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. రెడ్డి కృష్ణకుమారి 18వ వార్డులో ఓటమి చెంది 25వ వార్డులో గెలుపొందారు. రెడ్డి రాధాకృష్ణ 27వ వార్డులో పరాజయం పాలై 11వ వార్డులో విజయం సాధించారు. అనంతరం ఆయన మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

2014లో మరోసారి పసుపు జెండా రెపరెపలు…

2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున దివంగత చుండ్రు వరప్రకాశ్‌ను రంగంలోకి దింపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పారిశ్రామికవేత్త వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి నీ రంగం లో నిలిచారు.  ఇద్దరు కమ్మ సామాజిక వర్గం కు చెందిన వారే.

పరోక్ష పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే అత్యధిక కౌన్సిలర్ స్థానాలను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. చుండ్రు వరప్రకాశ్ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో మండపేట పురపాలక సంఘంపై టీడీపీ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది.

2021లో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టిన వైసీపీ…

మండపేట మున్సిపల్ రాజకీయాల్లో 2021 ఎన్నికలు కీలక మలుపుగా నిలిచాయి. వాస్తవానికి 2020లోనే ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైనప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. అనంతరం 2021 మార్చిలో ఎన్నికలు నిర్వహించారు.

అప్పట్లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైసీపీ తరఫున పతివాడ నూక దుర్గారాణి రంగంలోకి దిగగా, టీడీపీ నుంచి తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి అభ్యర్థిగా నిలిచారు. ఇద్దరు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఇద్దరు సమీప బంధువులు.

ఈ ఎన్నికల్లో అప్పటి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కీలక పాత్ర పోషించారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ విజయానికి వ్యూహరచన చేశారు.ఫలితాల్లో అనూహ్యంగా వైసీపీ అత్యధిక కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కేవలం ఏడు స్థానాలకే పరిమితమైంది. దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న మండపేట మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో చేరింది. పతివాడ దుర్గారాణి చైర్‌పర్సన్ పీఠాన్ని అధిష్ఠించారు. 1987 తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగిన టీడీపీ విజయపరంపరకు ఈ ఫలితాలు బ్రేక్ వేశాయి.

2026లో మున్సిపల్ పీఠం ఎవరిది?

తాజాగా 2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మండపేటలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో టీడీపీ, వైసీపీలు మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం చైర్‌పర్సన్ స్థానం అన్ రిజర్వడు కావడంతో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. 

గత ఎన్నికల్లో కోల్పోయిన మున్సిపల్ పీఠాన్ని తిరిగి దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉండగా, 2021లో సాధించిన విజయాన్ని పునరావృతం చేసి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

వేగుళ్ళ తోట ఇద్దరికి ప్రతిష్టాత్మకం…

మునిసిపల్ ఎన్నికలు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇద్దరికి ప్రతిష్టాత్మకమే.

నిజానికి ఇక్కడ చైర్ పర్సన్ ఎన్నిక కన్నా.. ఇద్దరి మధ్య పోటీ గా భావించాల్సిన పరిస్థితి నెలకొంది. 

దశాబ్దాల రాజకీయ చరిత్ర, మారుతున్న సామాజిక సమీకరణాలు, చైర్‌పర్సన్ రిజర్వేషన్, స్థానిక నాయకుల వ్యూహాలు ఈసారి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలుగా కనిపిస్తున్నాయి.1987లో కాంగ్రెస్  ఆ తర్వాత వరుసగా టీడీపీ 2021లో వైసీపీ  మరి 2026లో మండపేట మున్సిపల్ పీఠంపై ఏ పార్టీ జెండా ఎగురుతుంది? అన్నది ఇప్పుడు పట్టణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.