నెల్లిమర్ల నగరపంచాయతీ చైర్మన్ పీఠం రసవత్తరం * బరిలో నలుగురు అభ్యర్థులు *
నెల్లిమర్ల, సూర్య : నెల్లిమర్ల నగరపంచాయతీ చైర్మన్ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా స్పష్టమైంది. మైపాడ ప్రసాద్ (బిజెపి కూటమి అభ్యర్థి) సముద్రపు రామారావు(వైసిపి), కనకల పద్మనాభం(కాంగ్రెస్) లెంక అప్పలనాయుడు(స్వతంత్రం)బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల్లో నెలకొన్న రెబల్ అభ్యర్థుల బెడద చాలావరకు తొలగిపోవడంతో ఎన్నికల చిత్రం స్పష్టత సంతరించుకుంది.
నామినేషన్ల ఉపసంహరణల పర్వం
చైర్మన్ పదవి కోసం డమ్మీ అభ్యర్థులతో కలిపి మొత్తం 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి తొమ్మిది మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు.
బరిలో నిలిచిన రెబల్స్ ఉపసంహరణ
ఎన్నికలను ఏకపక్షం కాకుండా రసవత్తరంగా మార్చిన రెబల్ అభ్యర్థులు కొందరు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. జనసేన పార్టీ తరఫున రెబల్ చైర్మన్ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన రవ్వా నాని, జనా ప్రసాద్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వైసీపీ తరఫున రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మొయిద శ్రీనివాసరావు కూడా తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
తుది పోరులో నలుగురు
నామినేషన్ల ఉపసంహరణలు ముగిసిన తర్వాత, ప్రస్తుతం నెల్లిమర్ల నగరపంచాయతీ చైర్మన్ రేసులో కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రమే తుదిపోరులో నిలిచారు. ప్రధాన పార్టీల వ్యూహాలు, రెబల్స్ ఉపసంహరణతో చైర్మన్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై స్థానికంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.