లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేయాలి.. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ
మణుగూరు ఆర్ సి సూర్య; సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి. సూర్యనారాయణ బుధవారం మణుగూరు ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ డి.వెంకట రామారావు మరియు సంబందిత అధికారులతో కలిసి కె సి హెచ్ పి, పీకేఓసీ-॥ గనులను సందర్శించి, బొగ్గు ప్రాసెసింగ్, క్రషర్ల పనితీరు, బొగ్గు వెలికితీత, ఉత్పత్తి లక్ష్యాల సాధనకు చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి మణుగూరు ఏరియాకు నిర్దేశించిన 122.10 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం కె సి హెచ్ పి ని సందర్శించి, బొగ్గు ప్రాసెసింగ్ కార్యకలాపాలను పరిశీలించారు.ఈ సందర్భంగా బొగ్గు పెద్దపెళ్లలు క్రషర్ల పనితీరును సమీక్షించారు. బొగ్గును నిర్దేశిత పరిమాణంలోకి తీసుకువచ్చేందుకు క్రషర్లు సమర్ధవంతంగా పనిచేయడం ముఖ్యమని పేర్కొన్నారు. క్రషర్ల నిర్వహణ, మరమ్మతులను సకాలంలో చేపడుతూ, యంత్రాలు నిరంతరాయంగా పనిచేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బొగ్గులో మట్టి, రాళ్లు ఇతర మలినాలు కలవకుండా జాగ్రత్తలు పాటిస్తూ, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రాసెసింగ్ చేపట్టాలని తెలిపారు. నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు అందించేందుకు నాణ్యత నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.
*పీకేఓసీ-11 గని ని సందర్శించిన డైరెక్టర్ ఆపరేషన్స్*
అనంతరం డైరెక్టర్
ఆపరేషన్స్ గారు పీకేఓసీ-|| గనిలోని వ్యూ పాయింట్‌ను సందర్శించి,గని కార్యకలాపాలు, ఉత్పత్తి పరిస్థితులను పరిశీలించారు. తదుపరి బొగ్గు బెంచ్‌లను సందర్శించి, అక్కడ జరుగుతున్న బొగ్గు వెలికితీత పనులను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. బొగ్గు ఉత్పత్తి పురోగతి, నాణ్యత, పరిమాణం సాధనకు అనుసరిస్తున్న విధానాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంతో పాటు, బొగ్గు నాణ్యతను కాపాడుతూ నిర్దేశిత పరిమాణంలో ఉత్పత్తి సాధించాలని సూచించారు. గనిలో అందుబాటులో ఉన్న యంత్రాలు, మానవ వనరులను సమన్వయంతో వినియోగించుకుంటూ, ఉత్పత్తి ప్రక్రియలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని తెలిపారు.గనుల్లో బొగ్గు వెలికితీత పనులకు ఆటంకాలు కలగకుండా, బాటమ్ బెంచ్‌లు మరియు ఇతర అవసరమైన ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని సకాలంలో తొలగించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఎల్.వి. సూర్యనారాయణ అధికారులకు సూచించారు. డీవాటరింగ్ పంపులు, సంబంధిత పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. నీటి కారణంగా బొగ్గు ఉత్పత్తి పనులకు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, రక్షణ ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తి కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేలా చూడాలని సూచించారు.
*వార్షిక లక్ష్యం 122.10 లక్షల టన్నులు*
2026-27 ఆర్థిక సంవత్సరానికి మణుగూరు ఏరియాకు నిర్దేశించిన 122.10 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రోజుకు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే దిశగా పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని తెలిపారు. గనులు, అనుబంధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించి, రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను నిరంతరం సమీక్షిందాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తి పరిమాణాన్ని పెంచడంతో పాటు నాణ్యతను కాపాడటం. ఉత్పత్తి చేసిన బొగ్గును సకాలంలో ప్రాసెసింగ్ చేసి రవాణాకు సిద్ధం చేయడం ద్వారా ఏరియా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో భారీ ఎర్త్ మూవింగ్ యంత్రాల వినియోగం కీలకమని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న షావెల్స్,డంపర్లు,ఇతర భారీ యంత్రాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.యంత్రాల నిర్వహణ,సాంకేతిక సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు చేపట్టి, పనివేళల నష్టాన్ని తగ్గించాలని తెలిపారు. ఉత్పత్తి పెంపునకు అవసరమైన చర్యల్లో భాగంగా యంత్రాల పని గంటలను రోజుకు 16 గంటలకు పెంచే దిశగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. షిప్టుల నిర్వహణ, యంత్రాల లభ్యత, సిబ్బంది సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించి, పూర్తిస్థాయి పని గంటలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
*రక్షణ, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత*
బొగ్గు ఉత్పత్తి పెంపు క్రమంలో రక్షణ ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డైరెక్టర్ ఆపరేషన్స్ స్పష్టం చేశారు. గనుల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిర్దేశిత రక్షణ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, భారీ యంత్రాల నిర్వహణ, బొగ్గు వెలికితీత పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్పత్తి పరిమాణాన్ని పెంచడంతో పాటు బొగ్గు నాణ్యతను కాపాడటం, యంత్రాల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించడం, పని గంటలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు.
ఈ పర్యటనలో ఏరియా ఇంజినీర్ వి. మధన్ నాయక్,కె సి హెచ్ పి
డీజీఎo ఆర్.ఎస్.గౌడే, ప్రాజెక్ట్ మేనేజర్ సౌరభ్ సుమన్, మేనేజర్ ఆపరేషన్స్ సురేశ్ , క్వాలిటీ హెచ్డీ నాగరమేష్, ఏరియా సెక్యూరిటీ అధికారి కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.