మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, మేజర్ న్యూస్ : బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సమష్టి కృషితో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బుచ్చిరెడ్డిపాళెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు బీ-ఫాంలను అందజేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్ నాయకత్వంలో అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. కూటమి నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని గడపగడపకూ తీసుకెళ్లాలి
గత రెండున్నరేళ్లలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూటమి శ్రేణులకు సూచించారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడంతో పాటు, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత శ్రీ నారా లోకేశ్ గారు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నారని ప్రజలకు వివరించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
నాపై చూపిన ఆదరణను కూటమి అభ్యర్థుల విజయంతో చాటాలి
కోవూరు శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తనను సొంత ఇంటి బిడ్డగా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గుర్తుచేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. అదే ఆదరణను బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అందించి, తనకు వచ్చిన మెజారిటీ కంటే అధిక మెజారిటీతో వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో ఆశావహులు చాలామంది ఉన్నప్పటికీ, కూటమి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక జరిగిందని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.
త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో గుర్తింపు
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల కోసం తమ అవకాశాలను పక్కనపెట్టి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సేవలను గుర్తిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైనా కూటమి గెలుపే అందరి ఉమ్మడి లక్ష్యంగా ఉండాలని అన్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ప్రచారం నిర్వహించి, ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఎం నుంచి టీడీపీలోకి 15 మందికి పైగా
బుచ్చిరెడ్డిపాళెం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ బెజవాడ జగదీశ్ గారి ఆధ్వర్యంలో సీపీఎంకు చెందిన కీలక నాయకుడు ప్రసాద్, ఆయన అనుచరులు 15 మందికి పైగా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.