అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు
అనపర్తి మేజర్ న్యూస్: అనపర్తి మండలంలో జడ్పీటీసీ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరఫున ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున పొలమూరు గ్రామానికి చెందిన వాసంశెట్టి నాగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనపర్తి గ్రామానికి చెందిన కొండేటి భీమేశ్వరరావు జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీకి సిద్ధమయ్యారు.
ఇద్దరూ గురువారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. పేర్లలో ఈశ్వరుడిని కలిగి ఉన్న ఈ ఇద్దరు అభ్యర్థులు రాజకీయ బరిలో తలపడుతుండటంతో స్థానికంగా ఈ పోటీపై ఆసక్తి నెలకొంది. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాసంశెట్టి నాగేశ్వరరావు పొలమూరు గ్రామానికి చెందిన విద్యావంతుడు. ఆయన గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా కొనసాగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వృత్తిరీత్యా గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురితో పరిచయాలు కలిగి ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. అందరితో సన్నిహితంగా మెలుగుతూ, పార్టీ శ్రేణులను కలుపుకొని ముందుకు సాగడం ద్వారా తెలుగుదేశం పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది
.ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, తనకు పరిచయం ఉన్నవారితో సన్నిహితంగా వ్యవహరించడం నాగేశ్వరరావుకు రాజకీయంగా బలంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనపర్తి గ్రామానికి చెందిన కొండేటి భీమేశ్వరరావు జడ్పీటీసీ బరిలో నిలిచారు. గతంలో ఎంపీటీసీ అభ్యర్థిగా విజయం సాధించి ప్రజాప్రతినిధిగా సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, తన పరిధిలో సాధ్యమైనంత మేరకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న వ్యక్తిగా ఆయనకు స్థానికంగా మంచి పేరు ఉందని అనుచరులు పేర్కొంటున్నారు. గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం, గ్రామస్థాయిలో ఉన్న పరిచయాలు, ప్రజలతో కొనసాగిస్తున్న సంబంధాలు ఈ ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. వైసీపీ శ్రేణుల మద్దతుతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ప్రయత్నించనున్నారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాసంశెట్టి నాగేశ్వరరావు, కొండేటి భీమేశ్వరరావు ఇద్దరూ బీసీ సామాజికవర్గానికి చెందినవారే కావడం మరో ఆసక్తికర అంశం. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగేశ్వరరావు, మరోవైపు వైసీపీ అభ్యర్థిగా భీమేశ్వరరావు పోటీ పడుతుండటంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ పోటీ తీవ్రంగా ఉండే అవకాశముంది.ఇద్దరికీ తమ తమ ప్రాంతాల్లో పరిచయాలు, ప్రజలతో సంబంధాలు ఉండటంతో ఎన్నికల ప్రచారంలో ఎవరికి ఎంతటి మద్దతు లభిస్తుందన్నది కీలకంగా మారనుంది. పార్టీ బలం, అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, గతంలో ప్రజలకు అందించిన సేవలు, ఎన్నికల సమయంలో ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకోగలరన్న అంశాలు ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.నామినేషన్ల దాఖలుతో అనపర్తి మండలంలో జడ్పీటీసీ ఎన్నికల సందడి మరింత పెరిగింది.